
12 గంటల ప్యాకేజీ అందిస్తున్న టీఎస్‌ఆర్‌టీసీ... వీకెండ్‌లో హైదరాబాద్ టూర్.
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) వీకెండ్‌లో హైదరాబాద్ చూడాలనుకునేవారి కోసం ప్రత్యేకమైన ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ దర్శన్ (Hyderabad Darshan) ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
వీకెండ్‌లో సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? ఒక రోజు సరదాగా బయట గడపాలనుకుంటున్నారా? తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) హైదరాబాద్ దర్శన్ (Hyderabad Darshan) పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కేవలం 12 గంటల్లో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు చూడండి అంటూ పిలుపునిస్తోంది.
హైదరాబాద్‌లో పార్కులు, ప్యాలెస్‌లు, మ్యూజియం, హుస్సేన్ సాగర్ లాంటి ప్రాంతాలన్నీ 12 గంటల్లో చూడొచ్చు. ఒక రోజులో హైదరాబాద్‌లోని టూరిస్ట్ స్పాట్స్ చూడాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. పర్యాటకులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్లు బుక్ చేయొచ్చు.
టీఎస్‌ఆర్‌టీసీ హైదరాబాద్ దర్శన్ టూర్ ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ దగ్గర ప్రారంభం అవుతుంది. పర్యాటకులు టీఎస్‌ఆర్‌టీసీ టూరిస్ట్ బస్ ఎక్కాలి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లామందిర్ సందర్శించవచ్చు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చౌమహల్లా ప్యాలెస్ సందర్శించవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.45 గంటల వరకు తారామతి బారాదరి రిసార్ట్‌లో హరిత హోటల్‌లో లంచ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు గోల్కొండ కోట సందర్శించవచ్చు.
సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు పార్క్ చూడొచ్చు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జిపై షికారు చేయొచ్చు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎన్‌టీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ సందర్శన ఉంటుంది. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆల్పా హోటల్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టీఎస్‌ఆర్‌టీసీ హైదరాబాద్ దర్శన్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 చెల్లించాలి. మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 చెల్లించాలి. లాంఛ్ ఆఫర్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది టీఎస్‌ఆర్‌టీసీ. ఇది వీకెండ్ టూర్ ప్యాకేజీ మాత్రమే.
టీఎస్‌ఆర్‌టీసీ హైదరాబాద్ దర్శన్ టూర్ ప్యాకేజీని www.tsrtconline.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 040 23450033 లేదా 040 69440000 నెంబర్లను కాంటాక్ట్ చేయాలి.